విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2015 Tcinema.net : 3.5/5 దర్శకుడు : మణిరత్నం నిర్మాత : దిల్‌రాజు సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్..
గతంలో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం.. గత కొంతకాలంగా తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మణి రత్నం ఈజ్ బ్యాక్’ అన్న స్లోగన్ ‘ఓకే బంగారం’ సినిమాకు మొదటి నుంచీ వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన ‘ఓకే బంగారం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ద్వారా మణిరత్నం మళ్ళీ తన మార్క్ చూపెట్టారా? తాను ఇంతకుముందే నిరూపించి చూపిన అద్భుత ఆవిష్కరణను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించగలిగారా? చూద్దాం..
కథ :
ఓ ప్రముఖ గేమింగ్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించి ముంబై నగరానికి వస్తాడు ఆదిత్య (దుల్కర్ సల్మాన్). స్టేషన్‌లో దిగగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న తార(నిత్యామీనన్)ను చూస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించడం, తర్వాత కొంత కాలానికి వీరిద్దరూ ఓ ఫంక్షన్‌లో కలుసుకోవడం, ఇద్దరూ అతి కొద్ది కాలంలోనే దగ్గరైపోవడం జరిగిపోతుంది. తారకు తాను పెరిగి వచ్చిన పరిస్థితుల వల్ల పెళ్ళి అనే కాన్సెప్టే నచ్చదు. ఆదిత్యకు కూడా పెళ్ళి అనేది నచ్చదు. యూఎస్ వెళ్ళిపోయి ఏదైనా పెద్ద కంపెనీ పెట్టాలన్నది ఆదిత్య ఆశయం, పారిస్ వెళ్ళి ఆర్కిటెక్చర్ చదువుకోవాలన్నది తార కల.
వీరిద్దరూ తమ తమ కలలను చేరుకోవడానికి మధ్య గల ఒక ఆరు నెలల సమయం సహ జీవనం చేయాలనుకుంటారు. ఆదిత్య తాను ఉండే ఇంట్లోనే తారతో కలిసి సహజీవనం చేస్తుంటాడు. దుల్కర్ ఇంటి ఓనర్ గణపతి (ప్రకాష్ రాజ్), అతని భార్య భవాని (లీలా శామ్సన్)లను ఒప్పించి వీరు సహజీవనం చేస్తుంటారు. వారిద్దరూ ఒకరినొకరు వదిలేసి వెళ్ళిపోయే సమయానికి వాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చింది? గణపతి-భవానిల జంట నుంచి వారిద్దరూ ఏం నేర్చుకున్నారన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధానం బలం ఏంటని అడిగితే నిస్సందేహంగా అది మణిరత్నం స్క్రీన్‌ప్లే అనే చెప్పాలి. క్లుప్తంగా చూసినప్పుడు ఈ సినిమాలో బలమైన కథ పెద్దగా కనిపించదు. తెలిసిన కథలోనే కొన్ని బలమైన అంశాలను ఒడిసిపట్టి స్క్రీన్‌ప్లేలో ఆ అంశాలను ఒక్కొక్కటిగా చాలా తెలివిగా తెరకెక్కించిన విధానం అబ్బురపరుస్తుంది. తాను ఏయే విషయాల్లో మాష్టర్ అని నిరూపించుకున్నారో వాటన్నింటినీ ఓ పద్ధతిలో చెప్పడం మణిరత్నంకే చెల్లింది. మొదటి పది నిమిషాలకే కథలోకి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఇంటర్వెల్ వరకూ కదలనీయకుండా కథ చెప్పడం సినిమాకు గొప్ప ప్లస్ పాయింట్. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం అద్భుతమనే చెప్పాలి. క్లైమాక్స్ కోసం కావాలని ఓ డ్రామాను నడిపించకుండా మొదటి సన్నివేశం నుంచే క్లైమాక్స్‌కు దారిని ఏర్పరచడం మణిరత్నం మ్యాజిక్.
దుల్కర్, నిత్యామీనన్‌ల కెమిస్ట్రీ చూసిన వారెవ్వరైనా ఇట్టే వారిపై ప్రేమలో పడిపోతారు. మొదట్లో ఉన్న దానికి చివర్లో వీరి మార్పుకు కారణమైన అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్‌ల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తూ సినిమాకు మరింత అందాన్ని చేకూర్చాయి. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
ఆదిత్యగా నటించిన దుల్కర్ సల్మాన్ చాలా బాగా నటించాడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించడంలో కూడా తెలివిగా నటిస్తూ పూర్తి మార్కులు కొట్టేశాడు. నాని అందించిన డబ్బింగ్ దుల్కర్ పాత్రను మరింత ఎత్తులో నిలబెట్టింది. తారగా నటించిన నిత్యామీనన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ పాత్రకు మరొకరిని ఊహించే ప్రయత్నం కూడా మనకు కల్పించే అవకాశం ఇవ్వలేదంటే ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంతగా ఆకట్టుకుందనేది చెప్పేయొచ్చు. ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్‌లతో పాటు మిగతా నటీనటులంతా చాలా బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథాంశం కొత్తదైనా కథ మాత్రం చాలా పాతదే! మనం ఇప్పటివరకూ ఇలాంటి ఫార్ములా కథలను చాలా సినిమాల్లో చూసి ఉన్నాం. అయితే ఓ ప్రేమకథలో ఇంతకుముంచి కథ ఉండదు కూడా. మణిరత్నం లాంటి జీనియస్ దర్శకుడైనా ఇలాంటి కథలను ఫార్ములా సన్నివేశాల ద్వారానే మొదలుపెట్టడం, ఫార్ములా సన్నివేశం ద్వారానే ముగించడం కొంత నిరుత్సాహపరుస్తుంది. ఫస్టాఫ్‌ను, సెకండాఫ్‌లోని మొదటి ఇరవై నిమిషాలను చాలా తెలివిగా చెప్పి, ఆ తర్వాత ప్రీక్లైమాక్స్ వరకూ గల విలువైన భావోద్వేగాన్ని క్యాప్చర్ చేయగల సన్నివేశాలను అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు.
ఇలాంటి అందమైన ప్రేమకథల్లో అనవసరమైన కామెడీ సన్నివేశాలని జొప్పించలేరు. అలాంటి సన్నివేశాలను కోరుకునే వారికి ఇది కొంత నిరుత్సాహ పరిచే అంశం. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలను మాత్రమే బాగా ఇష్టపడే వారికి ఇందులో కనెక్టయ్యే అంశాలు చాలా తక్కువ.
సాంకేతిక విభాగం :
ముందుగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ మణిరత్నం గురించి చెప్పుకుంటే.. తనకు మాత్రమే సాధ్యమైన కొన్ని అద్భుతమైన భావోద్వేగాలను తెరకెక్కించే టెక్నిక్‌ను ఈ సినిమాలో ప్రతీ సన్నివేశంలో చూడొచ్చు. ఎప్పుడెప్పుడు మణిరత్నం తన స్థాయి సినిమా తీస్తాడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ‘ఇదీ మణిరత్నం సినిమా’ అనే విషయాన్ని మరోసారి తీసి చూపించారు. మనకు చాలా బాగా తెలిసిన, ఇంతకుముందు ఎన్నోసార్లు చూసిన సన్నివేశాలనే మనకు తెలియని కోణంలో తెరకెక్కించడం మణిరత్నం ఫిల్మ్‌మేకింగ్ టెక్నిక్ ఏ స్థాయిదో చెప్పే చిన్న ఉదాహరణ.
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. సినిమాలోని ఎమోషన్‌ను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు పీసీ శ్రీరామ్. ఏ.ఆర్.రెహమాన్ పాటలు ఎంత బాగున్నాయో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ అంతకుమించి బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుడి మూడ్‌ని క్యాప్చర్ చేయడంలో ఎడిటింగ్ పనితనం ఆకట్టుకుంటుంది.
తీర్పు :
‘మణిరత్నం సినిమాలంటే ఇలా ఉంటాయ్’ అని చెప్పే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ సినిమా తప్పకుండా ఆ లోటును భర్తీ చేసే సినిమా! మణిరత్నం మార్క్ కథనం, సన్నివేశాలు, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్, దుల్కర్, నిత్యామీనన్‌ల అద్భుత నటన ఈ సినిమాకు ప్రధాన బలం. కథలో కొత్తదనం లేకపోయినా కథనం కట్టిపడేసిదిగా ఉండడం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎప్పుడో గానీ ఇలాంటి అందమైన, అర్థవంతమైన ప్రేమకథలు రావు. మణిరత్నమైనా ఇలాంటి సినిమాను ఎప్పుడో గానీ చేయలేరు. ఈ వీకెండ్‌కి తప్పక చూడాల్సిన సినిమా.. ‘ఓకే బంగారం’.